Wednesday, August 18, 2010

మా ఊరి ముచ్చట్లు..

          మాది నల్గొండ జిల్లాలో మామిళ్లగూడెం అనే గ్రామం. మా ఊరన్నా.. అక్కడ గడపడమన్నా నాకు చాలా ఇష్టం..చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పొలాలు, మంచి మనసున్న మనుషులు, స్వచ్చంగా పలకరించే జనాలు, అక్కడ తాటి చెట్ల కల్లు..  అన్ని నాకు బాగా ఇష్టం. అందుకే కుదిరినపుడల్లా ఆఫీసుకి సెలవు పెట్టి ఊరికి వెళ్తుంటా. నాన్న కూడా పనుల ఒత్తిడి ఉన్నప్పుడు ఇంటికి రమ్మని కాల్ చేస్తారు. కాల్ రావడమే ఆలస్యం సెలవు తీసుకొని బయల్దేరతా. ఈసారి కూడా అలాగే జరిగింది. ఆదివారం రోజు రాత్రి నాన్న ఫోన్ చేయగానే సోమవారం మద్యాహ్నం ఊరికి బయల్దేరాను 3 రోజులు సెలవు పెట్టి...

           తెల్లారి ఉదయం ఇంటికి పక్కనే ఉన్న పొలం దగ్గరకు వెళ్లి వస్తుంటే ఖాళీ డీజిల్ కాన్ పట్టుకొని బండి మీద వెళ్తూ శ్రీను బాబాయ్ గాడు కనిపించాడు. (శ్రీను గాడు నాన్న వల్ల బాబాయ్ కొడుకు.. నాకంటే నాలుగేళ్ళు పెద్ద. కాని చిన్నపటినుంచి క్లోజ్ గా ఉన్నాం అందుకని వాడు, వీడు అని అనడం, పేరు పెట్టి పిలవడం అలవాటు) నన్ను చూసి వస్తావా అని అడిగాడు. పోయే దారిలో తాటి చెట్ల వైపు బండి తీసుకెళ్తుంటే.. ఏరా ట్రాక్టర్ డీజిల్ కంటే ముందు నీకు డీజిల్ కావాలా అని నవ్వుకుంటూ కల్లు తాగడానికి వెళ్ళాం... చెరో 1.5 లి. బాటిల్ తీసుకున్నాం. మాట్లాడుకుంటూ అర్ధగంట కూర్చొని తాగాం.. చాలా గ్యాప్ వచ్చింది కదా నాకు తొందరగా ఎక్కింది. వాడికి రెగ్యులర్ గా అలవాటు కదా అందుకే కూల్ గా బండి డ్రైవ్ చేసుకుంటూ డీజిల్ తీసుకొని వచ్చాక నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు.. అప్పటికి 10 దాటింది. నానమ్మ క్లాసు స్టార్ట్ చేసింది పొద్దున 8 గంటలకు పొలం దగ్గరకు పోతున్న అని చెప్పి కనీసం టీ కూడా తాగకుండా వెళ్లి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని.. ఏం మాట్లాడకుండా వెళ్లి వేడి వేడిగా అన్నం పెట్టుకొని తిన్నా.. మాట్లాడితే కల్లు విషయం బయటపడుతుంది కదా.. మత్తుతో నిద్ర ముంచుకొచ్చింది. పడుకొని మధ్యానం 1కి లేచా.. ఇంకా మత్తు వదల్లేదు.. ఆ మత్తులోనే తనకు (sweety) కాల్ చేశా.. ఏదేదో మాట్లాడా.. తను hurt అయిందనుకుంట.. తర్వాత కాల్ చేస్తానని చెప్పి కట్ చేసింది.. మళ్ళీ చేయలేదు.. ఇప్పటికీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా.. నేను కాల్ చేద్దామంటే తప్పు చేసానన్న గిల్టీ ఫీలింగ్.. అందుకే చేయలేదు..

           నాకు కల్లు అంటే చాలా ఇష్టం. నేను తాగేది అదొక్కటే కాబట్టి ఇంట్లోవాళ్ళు ఎపుడు అభ్యంతరం చెప్పలేదు. కానీ చెట్ల దగ్గర తాగొద్దు, ఇంటికి తెప్పించుకో అని మాత్రమే చెప్తారు. ఒకరిద్దరు అయితే సరే కాని ఆరేడు మంది కలిసి ఇంట్లో పార్టీ చేసుకుంటే బాగుండదు కదా అందుకే మేం అందరం కలిసినపుడు చిన్న తాత వాళ్ళ నిమ్మ తోటలో కాని (శ్రీను గాడిది), మా చేను దగ్గర మామిడి తోటలో కాని సీక్రెట్ గా కూర్చుంటాం. మా ఫ్రెండ్స్ లో నాలాగా ఓన్లీ కల్లు తాగేవారు ముగ్గురు ఉన్నారు. అందుకే ఊరికి వెళ్లానంటే ఫ్రెండ్స్ తో కల్లు విత్ చికెన్ పార్టీ జరగాల్సిందే.

           బుధవారం రోజు ఉదయం మా మేనత్త కొడుకు జనార్ధన్ గాడు వచ్చాడు. వాడిది కూడా నా age అయినా 2 నెలల క్రితం వాడికి కష్టాలు మొదలయ్యాయి(పెళ్లి అయింది). ముందురోజు సాయంత్రం నేనే కాల్ చేసి వాన్ని రమ్మని చెప్పా. కాసేపటికి గుంటూరులో ఫార్మసీ చదువుతున్న అల్లుడు సునీల్ గాడు (ఊర్లో వరసకు అక్క కొడుకు) కాల్ చేసాడు. నేను ఊర్లో ఉన్నానని చెప్పగానే.. అవునా, నేను కూడా బస్సు లో ఉన్నా, వస్తున్నా అని మధ్యానం దిగాడు. సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ప్రతినిధిగా పనిచేస్తున్న మా కజిన్ వేణుగాడు కూడా అపుడే వచ్చాడు.. సునీల్ గాడు రాగానే 'మామా పార్టీ' అన్నాడు. రేపు ఎలాగు వెళ్ళిపోతున్నా కదా అని, ఓకే అన్నాను. వెంటనే శ్రీను గాడికి కాల్ చేశా. ఎక్కడున్నాడో కనుక్కొని వెంటనే రమ్మని చెప్పా.. అప్పటికి 3.30 అయింది. తాగడం వరకు ఎంతఅయితే అంత నేను పెట్టుకుంటా అని చెప్పా.. తినడం ఖర్చు శ్రీను గాడు పెట్టుకుంటానన్నాడు. పార్టీకి డబ్బులు రెడీ అయ్యాయి..

            ఆ టైంలో అందరికీ కల్లు దొరకాలంటే కొంచెం కష్టం. అందుకని ఎంత దొరికితే అంత తీసుకొని రమ్మని 200 ఇచ్చి ఇద్దరిని పంపాం. కాసేపటి తర్వాత 4 బాటిల్స్ దొరికిందని కాల్ చేసారు. సరే అని చికెన్ షాప్ దగ్గరకు వెళ్లి ఒక కోడి కట్ చేయమని చెప్పాం. ఆ షాప్ వాని భార్య రమణ (లేడీ) చికెన్ బాగా చేస్తుంది. మా పార్టీకి ఎప్పుడు తనే వంటమనిషి. చికెన్ ఇచ్చి ఒకర్ని పంపి తొందరగా చేయించి తీసుకొని రమ్మని రమణ వాళ్ళ ఇంటికి పంపించాం. ఈలోగా కల్లు రెడీ అని కాల్ వచ్చింది. ఊరి బయట ఉన్న మా పెసర చేను దగ్గర ఉండమని చెప్పాం. 25 మినిట్స్ లో చికెన్ రెడీ అయింది. అందరం పెసర చేను స్పాట్ దగ్గరకు చేరుకున్నాం. అప్పటికి సుమారు 5.30 అయింది. మాతోపాటు శ్రీను గాడి ట్రాక్టర్ డ్రైవర్ గంగరాజు కూడా కలిసాడు. మొత్తం ఆరుగురం అయ్యాం.. కల్లు చూస్తే 4 బాటిల్స్ మాత్రమే ఉంది. శ్రీను, జనార్ధన్, గంగరాజులు బీర్ తాగుతారు కదా, వెళ్లి 4 తీసుకురా అని గంగరాజుకి 500 ఇచ్చి పంపాను. ఇక మొదలయింది సొల్లు ముచ్చట్లు చెప్పడం.. 2 గంటలు గడిచింది మొత్తం అయిపోయేవరకు.. మెల్లగా లేచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయాం.

                      ఇంటికి వెళ్లేసరికి నానమ్మ, తాతయ్యలు సీరియల్ చూస్తున్నారు. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయ్.. మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసి వచ్చి పడుకున్నా. తినవరా.. అని నానమ్మ అడిగింది. ఆకలిగా లేదు అని చెప్పి పడుకున్నా. (ఎందుకుంటది.., ఫుల్ గా తాగితింటే..?).. అర్ధరాత్రి 2 గంటలకు హైమక్క (మా యల్లారెడ్డి బాబాయ్ భార్య, మా పెద్ద మేనత్త కూతురు, చిన్నప్పటి నుంచి అక్క అని పిలుస్తా)  ఇంటికి వచ్చి అందర్ని నిద్రలేపింది. నేను లేచి చూస్తే నాన్న నాపక్కనే పడుకొని ఉన్నాడు.. 3 రోజులు హైదరాబాద్ వెళ్లి.. నేను పడుకున్నాక వచ్చాడు.. వచ్చిన వెంటనే ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది.. ""రైస్ మిల్ యజమాని పూర్ణ బాబు ఇంట్లో నైట్ 12.30కి దొంగలు పడ్డారు. ఆయన ఫంక్షన్ కి హైదరాబాద్ వెళ్ళాడు, భార్య, కొడుకుని బాగా కొట్టి 6 తులాల బంగారం దోచుకున్నారు. ఆ ముసలామె దొంగల నుంచి తప్పించుకొని మా ఇంటికి వచ్చింది. 'నా కొడుకుని చంపుతున్నారు అని మొత్తుకుంటుంటే' ఇంటి పక్కన ఉన్న నర్సిరెడ్డి, మీ బాబాయ్ పూర్ణబాబు వాళ్ళ ఇంటికి వెళ్లారు, నువ్ కూడా వెల్లురా నాకు భయంగా ఉంది"" అని చెప్పింది. డాడీ, నేను, వేణు గాడు కలిసి బండి వేసుకొని బయల్దేరాం, పోలీసులతో డాడీ ఫోన్ లో మాట్లాడారు.. r.m.p కి కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పారు. మా బాబాయ్ వాళ్ళు వెళ్లేలోగానే దొంగలు పరార్ అయ్యారంట.. కాసేపట్లో పోలీసులు వచ్చారు. ఎంక్వయిరీ ప్రారంభించారు.. గంటసేపు ఉండి నేను, వేణు ఇంటికి వెళ్ళిపోయాం. విషయం ఏమిటంటే మేము పార్టీ చేసిన చేనుకి 200 మీ. దూరంలోనే వాళ్ళ ఇల్లు. ''దొంగలు ఇక్కడికి రావటానికి ముందు ఈ చుట్టుపక్కలో చాలాసేపు ఉండి ఇంటిని గమనిస్తూ ఉంటారు. పొద్దున్నే అంతా వెతకండి, ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అని కానిస్టేబుల్ తో SI చెప్పారు''. అప్పుడు స్టార్ట్ అయింది మా భయం.. ఎక్కడ మా సీక్రెట్ పార్టీ విషయం బయట పడుతుందో అని టెన్షన్.. అలా ఏం కాదులే అని మాకు మేము ధైర్యం చెప్పుకొని వేణు, నేను ఇంటికి వెళ్లి పడుకున్నాం.

        తెల్లారి లేవగానే మళ్ళీ పూర్నబాబు ఇంటికి వెళ్ళాం. పోలీసులు వచ్చారు. మేము పార్టీ చేసిన వైపు కూడా కొద్ది దూరం వెళ్లారు కాని ఏం దొరకలేదు. మేము ఊపిరి పీల్చుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు నాకు నైట్ డ్యూటీ ఉందని మధ్యానం హైదరాబాద్ బయల్దేరాను. ఊర్లో 3 రోజులు 3 నిముషాల్లా గడిచినట్లు అనిపించింది నాకు బస్సులో వస్తుంటే..

                                             ఇక మళ్ళీ ఊరికి వెళ్ళడం దసరా పండుగకి కావొచ్చేమో...           

1 comment:

prashanth reddy said...

sorry.. kallu sollu kaastha ekkuvaindhi kadha....